ప్రభాస్‌ను కలిసేందుకు.. 350 కిలోమీటర్ల పాదయాత్ర!
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు చెప్పులు లేకుండా.. పగలు, రాత్రి, ఎండ, వాన లెక్కచేయని అభిమాని
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : అభిమానం అంటే కేవలం ఒక హీరో సినిమా చూడటమో.. పోస్టర్‌కు పాలాభిషేకం చేయడమో కాదు. తమ అభిమాన నటుడిని ఒక్కసారైనా కలవాలనే కోరిక కోసం ఎన్ని కష్టాలైనా భరించడమే అసలైన అభిమానమని చాటుతున్నాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం పర్వం గ్రామానికి చెందిన తిరుపతిరావుకు హీరో ప్రభాస్ అంటే చిన్ననాటి నుంచే ఎంతో అభిమానం. చదువుపై అంతగా ఆసక్తి లేకపోయినా.. ప్రభాస్ సినిమాలు, ఆయన వ్యక్తిత్వం తనలో చెరగని ముద్ర వేశాయని చెబుతున్నాడు. తన అభిమాన హీరోను ఒక్కసారైనా నేరుగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్ బాట పట్టాడు.అయితే సాధారణంగా బస్సులోనో, రైలులోనో వెళ్లకుండా.. చెప్పులు కూడా లేకుండా కాలినడకన హైదరాబాద్‌కు బయలుదేరాడు. పగలు ఎండైనా.. రాత్రి చీకటైనా.. వర్షం వచ్చినా తన ప్రయాణాన్ని ఆపకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే సుమారు 150 కిలోమీటర్లకు పైగా నడిచి వరంగల్ క్రాస్ రోడ్డు ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపాడు. ఇంకా హైదరాబాద్ చేరుకోవడానికి 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంది. ఒంటరిగా ఇంటి నుంచి బయలుదేరిన అతని లక్ష్యం ఒక్కటే.. తన అభిమాన హీరో ప్రభాస్‌ను ఒక్కసారైనా కలవడం.ఫోన్‌లోనూ, మాటల్లోనూ ప్రభాస్ పేరే పలుకుతూ.. తన అభిమానాన్ని నడక రూపంలో చూపిస్తున్న తిరుపతిరావు ప్రయాణం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోను అభిమానించడం చాలామంది చేస్తారు.. కానీ అభిమాన హీరోను కలవాలనే కోరికతో వందల కిలోమీటర్లు కాలినడకన సాగడం మాత్రం అరుదే. తన అభిమానాన్ని ప్రభాస్ వరకు చేర్చాలనే ఆశతో సాగుతున్న తిరుపతిరావు పాదయాత్ర ఎక్కడ ముగుస్తుందో చూడాలి. అతని కోరిక నెరవేరి.. అభిమాన హీరోను కలిసే అవకాశం దక్కాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి