రాజకీయాల్లో కొత్త ‘సేఫ్ గేమ్’.. శత్రువులతో స్నేహం.. మిత్రులతో దూరం!
ఇదే విషయంపై మంత్రి పొంగులేటి సైతం ఆగ్రహం
వ్యాపార వర్గాల్లో అధికమైన ఈ తీరి వ్యవహారం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. ఈ మాట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు దీనికి మరో కొత్త అర్థం జతవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే ‘పొలిటికల్ సేఫ్ గేమ్’. ఎవరు అధికారంలో ఉన్నా తమకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంబంధాలు చెడిపోకూడదు.. అవసరమైతే నిన్నటి ప్రత్యర్థితోనూ స్నేహం చేయాలి.. పరిస్థితులు మారితే నిన్నటి మిత్రుడితోనే దూరం పాటించాలి.. ఇదే కొందరి రాజకీయ వ్యూహంగా మారుతోందన్న చర్చ సాగుతోంది.
పార్టీ ఒక వైపు.. పరిచయాలు మరో వైపు!
రాజకీయ పార్టీల్లో కొనసాగుతూనే ఇతర పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఆ సంబంధాల వెనుక రాజకీయ భవిష్యత్తును ముందుగానే లెక్కగట్టే వ్యూహం ఉందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వ్యాపార నేపథ్యం ఉన్నవారు రావడంతో ‘రాజకీయంగా ఎవరు గెలిచినా.. మనం మాత్రం ఓడిపోకూడదు’ అనే ఆలోచన బలపడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘సేఫ్’గా ఉండాలంటే అన్ని వైపులా పరిచయాలా?
ప్రస్తుతం రాజకీయాల్లో కొందరి వ్యవహారశైలి చూస్తుంటే.. ఒకవైపు అధికార పార్టీతో సాన్నిహిత్యం.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్యులతోనూ సంబంధాలు.. ఇలా రెండు వైపులా తలుపులు తెరిచి ఉంచుకోవడమే భవిష్యత్ భద్రతకు మార్గమనే భావన కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ వ్యూహం రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? పార్టీ కోసం నిలబడే కార్యకర్తలకు ఇది ఎలాంటి సందేశం ఇస్తుంది? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఖమ్మం రూరల్‌లో మంత్రి క్లాస్.. ఎందుకు?
ఇటీవల ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు చేసిన సూచనలు కూడా ఈ నేపథ్యంలో చర్చకు వస్తున్నాయి.పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం, కార్యకర్తల పాత్ర, ప్రజల్లో ఉండాల్సిన బాధ్యత వంటి అంశాలపై మంత్రి చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోని కొందరి వ్యవహారశైలిపై పరోక్షంగా హెచ్చరికలేనా? అనే చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీకి కౌంటర్ ఇవ్వడంలోనూ అనధికారిక మిత్ర ధర్మాన్ని పాటిస్తున్న పై ఆగ్రహం సైతం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాజకీయాల్లో ‘సేఫ్ గేమ్’.. ప్రజల తీర్పు మాత్రం?
అధికారం మారుతుంది.. ప్రభుత్వాలు మారుతాయి.. రాజకీయ సమీకరణాలు మారుతాయి. కానీ ప్రజలు మాత్రం అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. అందుకే రాజకీయంగా ఎన్ని ‘సేఫ్ గేమ్’లు ఆడినా.. చివరికి ప్రజల ముందు ఎవరు ఎటువైపు నిలబడ్డారు? ఎవరి కోసం పనిచేశారు? ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు? అన్నదే తేల్చేది.అధికారం ఎటు తిరిగినా మన దారి సేఫ్ అనుకునే రాజకీయాలకు.. ప్రజల తీర్పు సేఫ్ గా ఉండదన్న ఒక విషయాన్ని మాత్రం గుర్తు ఎరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది.
వ్యాపార సేఫ్ గేమ్..!?
ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది నేతలు వ్యాపార నేపథ్యం ఉన్నవారే. రాజకీయాలతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు కొందరు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారనే చర్చ సాగుతోంది. అధికార పార్టీలో కొనసాగుతూనే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతోనూ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఇదే క్రమంలో ఓ వ్యాపారి వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుత అధికార పార్టీలో ఉంటూనే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తితో కలిసి రియల్ వ్యాపారం చేస్తున్నారనే టాక్ ఉంది. ఇటీవల ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో జరిగిన ‘అడ్జస్ట్మెంట్’ చర్చలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ చర్చల్లోని మాటలు బయటకు రావడంతో అసలు వ్యవహారం ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాజకీయ ప్రయోజనాలా.. వ్యాపార ప్రయోజనాలా.. లేక రెండింటి కలయికా అన్న చర్చ మొదలైంది. పార్టీలు మారినా.. వ్యాపార బంధాలు మాత్రం కొనసాగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి రాజకీయమా.. వ్యాపారమా.. ‘సేఫ్ గేమ్’ ఎవరిది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం..!

Excellent article Anna
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి