రాంపులు తొలగించి మట్టి రోడ్డు తవ్విన తర్వాత నిలిచిన పనులు
త్వరగా పూర్తి చేయాలని కాలనీవాసుల విజ్ఞప్తి
30వ వార్డులో రెండు రోడ్లు మంజూరయ్యాయని కమిషనర్ వెల్లడి
ఖమ్మంరూరల్/ప్రజాపక్షం : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల రాంపులను తొలగించి, మట్టి రోడ్డును తవ్విన అనంతరం పనులు నిలిచిపోవడంతో రాకపోకలకు అసౌకర్యం కలుగుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో తెలియక స్థానికులు ఎదురుచూస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రదేశంపై అభ్యంతరాలు రావడంతో కాంట్రాక్టర్ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోడ్డు తవ్వడంతో వర్షాలు లేదా ఇతర పరిస్థితుల్లో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
జనవరి 10న శంకుస్థాపన
ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే జనవరి 10న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న సమయంలో మున్సిపాలిటీ నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. శిలాఫలకంలో పేర్కొన్న వివరాలు, ప్రస్తుతం చేపట్టిన పనులపై నెలకొన్న సందేహాలకు అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మంజూరు ఉత్తర్వులు, పనుల పరిధి, సాంకేతిక అనుమతులను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు రోడ్లు మంజూరయ్యాయి: కమిషనర్
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, శిలాఫలకం వివాదానికి సంబంధించిన రోడ్డుతో పాటు సాయి బృందావన నగర్లో మరో రోడ్డు కూడా మంజూరైందని తెలిపారు. రెండు రోడ్ల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, రెండు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

إرسال تعليق