రూ.57 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
ప్రజాపక్షం / ఖమ్మం: పాఠశాలకు వెళ్లిన బాలికను మాయమాటలతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.57 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి డా. పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ బుధవారం తీర్పు వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అంజనపురి కాలనీకి చెందిన అల్లి రాకేష్ (22) 2023 సెప్టెంబర్ 20న ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక ఇంటి పక్కన నివాసం ఉండేవాడు. పాఠశాలకు వెళ్లిన బాలికను మాయమాటలతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు క్రైం నంబర్ 425/2023, ఎస్సీ నంబర్ 83/2023 కింద ఐపీసీ 366, 376, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, రూ.57 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ప్రాసిక్యూషన్‌కు సహకరించిన పోలీసు సిబ్బందికి అభినందనలు
ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు చేసిన అప్పటి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ప్రస్తుత ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం. ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ తల్లా రమణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోంగార్డులు అయూబ్, చిట్టిబాబులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి