ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నష్టపరిహారం చెల్లించకుంటే.. భూముల్లోకి అడుగుపెట్టనివ్వం!


 13 ఏళ్లుగా పరిహారం కోసం జాలిముడి రైతుల పోరాటం

హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్‌..

ఎక్స్కవేటర్‌ను అడ్డుకున్న బాధితులు

ప్రజాపక్షం/బోనకల్: భూసేకరణ జరిగి 13 సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం అందకపోవడంతో జాలిముడి భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. హైకోర్టు తీర్పు ప్రకారం తమకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లో పనులు చేపట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని రైతులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భూముల్లోకి వచ్చిన ఎక్స్కవేటర్‌ను రైతులు అడ్డుకున్నారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. జాలిముడి ప్రాజెక్టు కోసం 2013లో భూసేకరణ చేపట్టారు. అప్పటి భూసేకరణ చట్టం ప్రకారం తమకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు అవార్డు సమయంలో అభ్యంతరాలు, పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కొత్త భూసేకరణ చట్టం వస్తుందన్న హడావుడిలో అప్పటి అధికారులు 30-12-2013న ఎకరానికి కేవలం రూ.3 లక్షల చొప్పున అవార్డు ప్రకటించారని రైతులు పేర్కొన్నారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించి WP No.4257/2016 దాఖలు చేశారు. 06-10-2023న హైకోర్టు తీర్పు వెలువడినప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తీర్పు అనంతరం నష్టపరిహారం కోసం అధికారులను, మంత్రులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశామని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సైతం పలుమార్లు కలిసి తమ సమస్యను వివరించామని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు.

తీర్పు అమలు చేసే వరకు పోరాటం...

భూములు కోల్పోయి ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. “మా భూములకు పరిహారం చెల్లించకుండా భూముల్లోకి ఎవరినీ రానివ్వం. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని బాధిత రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు తీర్పును అమలు చేయడంతో పాటు భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది