ఖమ్మం రూరల్ పోలీసులకు చిక్కిన నలుగురు.. 10 మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్లు స్వాధీనం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులు, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఎస్హెచ్ఓ ముష్కరాజు వివరాలను వెల్లడించారు.. ఖమ్మం రూరల్‌కు చెందిన అంగులూరి ఏసుపాల్ (30), షేక్ మహ్మద్ రఫీ (19), పొగరత్తి వెంకటేష్ (32), వెండి రాము (26) గత కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులు, ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఖమ్మం రూరల్‌తో పాటు నేలకొండపల్లి, తల్లాడ, ఖమ్మం అర్బన్, ఖమ్మం 2 టౌన్, చింతకాని, కొణిజర్ల, వెంసూరు తదితర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.కాపర్ వైర్ల కోసం విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన కాపర్‌ను తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ చేసిన మోటార్లు, కాపర్ వైర్లను విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు.నిందితుల నుంచి 10 విద్యుత్ మోటార్లు, సుమారు 100 కిలోల కాపర్ వైర్లు, నేరాలకు ఉపయోగించిన బజాజ్ ఆర్ఈ ఏప్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరికృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

إرسال تعليق