పేగు బంధానికి ప్రతీకగా నిలిచిన వేడుకలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా వివాహమైన అక్కలు, చెల్లెళ్లు పుట్టింటికి చేరుకుని తమ అన్నదమ్ములకు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. అదే సమయంలో పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, తమ్ముళ్లు, చిన్నారులు సైతం రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నచిన్న చేతులకు రాఖీలు కట్టుకుంటూ, అన్నాచెల్లెళ్లు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సందడి చేశారు. చిన్నారుల నవ్వులతో ఇళ్లు కళకళలాడాయి. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అన్నదమ్ములకు రాఖీ కట్టి, జీవితాంతం తమకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. అన్నదమ్ములు సైతం అక్కాచెల్లెళ్లను ఎల్లవేళలా కాపాడుతామని భరోసా ఇస్తూ బహుమతులు అందజేశారు. పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్లతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. రాఖీ కట్టే సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య చోటుచేసుకున్న ఆప్యాయత, అనురాగం కుటుంబ సభ్యులను సైతం ఆనందానికి గురిచేసింది. రక్త సంబంధం కంటే ఆత్మీయతే గొప్పదని చాటే రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత బలపరిచింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి