9 ఏళ్లుగా మతాలకతీతంగా కొనసాగుతున్న రాఖీ బంధం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాఖీ పండుగ అంటే పేగు బంధానికి ప్రతీక. తోడబుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు పరస్పరం రాఖీలు కట్టుకుని ఆప్యాయతను చాటుకోవడం ఆనవాయితీ. అయితే పేగు బంధం లేకపోయినా ఆత్మీయతతో ఏర్పడిన బంధాలు కూడా రాఖీ పండుగకు ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో మతాలకతీతంగా కొనసాగుతున్న ఓ ఆత్మీయ బంధం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. స్థానికంగా నివసించే అక్రమ్‌కు చుట్టుపక్కల వారితో అక్కా, తమ్ముడు అనే ఆప్యాయతతో కూడిన అనుబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే స్థానిక ప్రాంతానికి చెందిన అడ్వకేట్ పావని గత తొమ్మిదేళ్లుగా అక్రమ్‌ను తన సొంత తమ్ముడిలా భావిస్తూ రాఖీ కడుతున్నారు. ప్రతి రాఖీ పండుగ సందర్భంగా ఈ ఆప్యాయతా బంధాన్ని కొనసాగిస్తూ మతాలకతీతంగా సోదరభావాన్ని చాటుతున్నారు. పేగు బంధం లేకపోయినా.. అక్క తమ్ముడి అనుబంధం కలిస్తే ఏర్పడే బంధం ఎంత బలమైనదో ఈ రాఖీ బంధం చాటుతోంది. తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆత్మీయత స్థానికంగా ప్రత్యేకంగా నిలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి