సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించి పంటలను కాపాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ఎం, వెంకటాయపాలెం గ్రామంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎస్కే లాలుమియా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు . పాలేరు నియోజకవర్గంలోని చెరువు ఆయకట్టు పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని సుమారు 21 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్లాది రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను రూపకల్పన చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి పాలేరు ప్రాంతానికి నీరు అందించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతున్నారని విమర్శించారు. ప్రజలు ధరల పెరుగుదలకు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఉక్కు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల పోరాట స్ఫూర్తితో పాలకవర్గాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ తరగతుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆవుల అశోక్ “సరుకు–శ్రమ–అదనపు విలువ” అంశంపై కార్యకర్తలకు బోధించారు. కార్పొరేట్ సంస్థలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా, గంట శ్రీనివాసరావు, గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, ఆర్.శివలింగం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి