పణితి ఉషా పేరు పై జోరుగా చర్చ
సామాజిక సమీకరణలపై కాంగ్రెస్ ఫోకస్
ప్రజాపక్షం /వైరా: వైరా సహకార పరపతి సంఘం నామినేటెడ్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈసారి ఆ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో వైరా మున్సిపాలిటీ 7వ వార్డు బ్రాహ్మణపల్లికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పణితి ఉషారాణి పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ కోసం పనిచేస్తూ, స్థానిక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పణితి సైదులు సతీమణి పణితి ఉష కు అవకాశం కల్పించే దిశగా పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇటీవలి కాలంలో నామినేటెడ్ పదవుల విషయంలో సామాజిక సమతుల్యతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే వ్యూహంలో భాగంగా వైరా సొసైటీ అధ్యక్ష పదవిని దళిత మహిళకు అప్పగిస్తే, సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వార్డు కౌన్సిలర్‌గా ఉన్న పణితి సైదులు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండగా, వారి కుటుంబానికి ఈ బాధ్యత అప్పగించడం ద్వారా పార్టీకి విధేయంగా పనిచేస్తున్న నాయకులను ప్రోత్సహించినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మరోవైపు, వైరా సహకార సంఘ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళకు అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉండటం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దళిత మహిళకు అవకాశం కల్పిస్తే మహిళా సాధికారతతో పాటు సామాజిక సమానత్వానికి కాంగ్రెస్ పెద్దపీట వేసినట్లవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే, ఈ పదవిపై ఇతర ఆశావహులు కూడా ఉన్నారని సమాచారం. రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. దీంతో వైరా సహకార సంఘ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోందన్న ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి