శ్రీరాంనగర్‌లో నిర్మాణ పనులను అడ్డుకున్న కాలనీవాసులు
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: కాల్వను కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ శ్రీరాంనగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్పీ కెనాల్లో చేపడుతున్న బెడ్డు నిర్మాణ పనులను శనివారం అడ్డుకుని పనులు నిలిపివేశారు.బ్రిడ్జి సమీపం నుంచి కాలనీ వెనుక నివాసాల వరకు ఓ వ్యక్తి తన ఫ్లాట్‌కు సంబంధించిన స్థలమంటూ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. కాలనీవాసుల నిరసనతో సదరు వ్యక్తి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలిపారు.ఇప్పటికే ఆక్రమణలతో కాల్వ ఇరుకుగా మారిందని, బెడ్డు నిర్మాణం పూర్తయితే కాల్వ వెడల్పు మరింత తగ్గి కేవలం మూడు అడుగుల మేరకు మిగిలే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో నీటిముంపుతో ఇబ్బందులు పడుతున్న తమ కాలనీకి ఇటువంటి నిర్మాణాలు మరింత ముప్పుగా మారుతాయని పేర్కొన్నారు. ఎన్ఎస్పీ అధికారులు తక్షణమే స్పందించి కాల్వను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరాంనగర్ వాసులు డిమాండ్ చేశారు.

إرسال تعليق