ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మహిళా సాధికారతే ప్రియదర్శిని సంకల్పం



 కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు

నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ ప్రోగ్రామ్

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఇంజినీరింగ్ విద్యను కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం చేయకుండా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించేలా విద్యార్థినులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాల ముందుకు సాగుతోందని కళాశాల చైర్మన్  కే. నవీన్ బాబు అన్నారు. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం అటానమస్‌లోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల కోసం సోమవారం ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కే. నవీన్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో ఇంజినీరింగ్ విద్యకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, విద్యార్థినులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అభ్యాసంతో ముందుకు సాగాలని అన్నారు. మహిళా సాధికారతకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, ఇంజినీరింగ్ విద్య ద్వారా విద్యార్థినులు తమ ప్రతిభను వెలికితీసుకుని ఆత్మవిశ్వాసంతో స్వయం ఆధారితంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రస్తుత నియామక ప్రక్రియలో కంపెనీలు కేవలం విద్యార్హతలకే పరిమితం కాకుండా టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ స్కిల్స్, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార సామర్థ్యం, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన వంటి అంశాలను పరిశీలిస్తున్నాయని నవీన్ బాబు తెలిపారు. విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమల అనుసంధాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

“కంపెనీలు ఏమి కోరుకుంటున్నాయో తెలుసుకుని.. ఆ నైపుణ్యాలను మనం అభివృద్ధి చేసుకుంటే ఉద్యోగం కోసం కంపెనీలను వెతకాల్సిన అవసరం ఉండదు.. కంపెనీలే మన ప్రతిభను వెతుక్కుంటూ వస్తాయి” అని విద్యార్థినులకు ఆయన స్ఫూర్తినిచ్చారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యం...

కళాశాల ప్రిన్సిపాల్ డా. బత్తుల గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీతో పాటు ఇతర విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యను కేవలం డిగ్రీకే పరిమితం చేయకుండా ఉద్యోగాలు, ఉన్నత విద్య, పరిశ్రమ అవసరాలు, స్వయం ఉపాధికి విద్యార్థులను సిద్ధం చేయడమే సంస్థ లక్ష్యమన్నారు.

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. నూతన ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సెల్ (ఐఐసీ)ను కళాశాలలో ప్రారంభించినట్లు వెల్లడించారు.

‘నేను సాధించగలను’ అనే నమ్మకంతో ముందుకు

అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినీ తనపై నమ్మకంతో “నేను సాధించగలను” అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఇంజినీరింగ్ విద్య కేవలం డిగ్రీ పొందే ప్రయాణం కాదని, జ్ఞానం, నైపుణ్యం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వాన్ని పెంపొందించే అవకాశమని అన్నారు. మొదటి సంవత్సరం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాదిగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాలలో ఇప్పటికే విద్యను అభ్యసిస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు తమ అనుభవాలను నూతన విద్యార్థినులు, తల్లిదండ్రులతో పంచుకున్నారు. కళాశాలలోని విద్యా సదుపాయాలు, అధ్యాపకుల సహకారం, సాంకేతిక కార్యక్రమాలు, ఉద్యోగావకాశాల కోసం అందుతున్న మార్గదర్శకత్వం గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన విద్యార్థినులకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు సాదర స్వాగతం పలికి.. వారి విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది