మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత
పెన్షన్ల నూతన మంజూరుపై కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లకు అవగాహన సదస్సు
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత సూచించారు. సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ అల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన చేయూత పెన్షన్ల నూతన మంజూరు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిజమైన అర్హులను గుర్తించడం అత్యంత కీలకమన్నారు. చేయూత పెన్షన్ నిరుపేదలు, అర్హులైన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే ముఖ్యమైన సంక్షేమ పథకమని తెలిపారు.
ప్రతి వార్డులో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులనువార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల ధ్రువీకరించాలన్నారు. అలాగే అర్హత ఉన్న ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనర్హులు లబ్ధి పొందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, జవాబుదారీతనం పాటించాలన్నారు. తమ తమ వార్డుల్లో అర్హులైన వ్యక్తులను గుర్తించడంలో కౌన్సిలర్లు సహకరించాలని, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి ధృవీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
సదస్సులో చేయూత పెన్షన్లకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అవసరమైన ధృవపత్రాలు, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి ధృవీకరణ, పెన్షన్ మంజూరులో పాటించాల్సిన విధివిధానాలపై అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి