వరుస ప్రమాదాలతో ప్రజల బెంబేలు..
భద్రతపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
ప్రజాపక్షం/బోనకల్: బోనకల్ మండలంలోని రావినూతల వే బ్రిడ్జి వద్ద వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సుబాబుల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు, ట్రాక్టర్ దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారు కొణిజర్ల మండలానికి చెందిన గ్రామీణ వైద్యులుగా సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరుస ప్రమాదాలతో నెత్తురోడుతున్న ఈ మార్గంలో రహదారి భద్రతా చర్యలు చేపట్టి, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి