ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆలోచనలకు రెక్కలు.. ఆవిష్కరణలకు ఊపిరి



 స్టార్టప్‌ల వైపు ప్రియదర్శిని విద్యార్థినుల అడుగులు

ఘనంగా ఇంట్రా–ఇన్‌స్టిట్యూషనల్ స్టార్టప్ పోటీ

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్:  ఏదులాపురం మున్సిపాలిటీలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల(అటానమస్) లో విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వినూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శనివారం ఇంట్రా–ఇన్‌స్టిట్యూషనల్ స్టార్టప్ కాంపిటీషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కటేపల్లి కే. నవీన్ బాబు మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్మించడంలో ఆవిష్కరణలు, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపించి, భవిష్యత్‌లో ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. బత్తుల గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, నైపుణ్యం కలిగిన అధ్యాపకుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరైన మార్గదర్శకత్వం, అధ్యాపకుల సహకారంతో విద్యార్థుల ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా అభివృద్ధి చేయవచ్చన్నారు. భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగ సృష్టికర్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

 TASK ప్రాజెక్ట్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టేట్ హెడ్ బాలు ప్రవర్యక్య మాట్లాడుతూ.. స్టార్టప్ ఆలోచనల అభివృద్ధి, మార్కెట్ అవసరాల గుర్తింపు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాపార అవకాశాలుగా మలుచుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించారు. సమాజానికి ఉపయోగపడే వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్టార్టప్ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ మాట్లాడుతూ.. విద్యతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పారిశ్రామిక నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. స్టార్టప్ పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు వారి ఆలోచనలను వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలుగా మార్చేందుకు దోహదపడతాయని అన్నారు.

ఈ పోటీలో దాదాపు 30 బృందాలు పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. జలనేత్ర, స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్, హార్ట్ అటాక్ డిటెక్షన్, ఎయిర్ అంబులెన్స్, ఫార్మ్ టు హోమ్, కిసాన్‌సాథి AI, స్మార్ట్ సిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర వినూత్న ప్రాజెక్టులను విద్యార్థినులు ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

‘ఆలోచించు–ఆవిష్కరించు–స్ఫూర్తినివ్వు–ప్రభావం చూపు’ అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో స్టార్టప్ సంస్కృతి, ఆవిష్కరణాత్మక ఆలోచనలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది.

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎన్. జయమ్మ, ఐఐసీ కోఆర్డినేటర్ వి. నాగరాజు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది