ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. 12 గ్రామాలకు తాగునీటి కష్టాలు




 


పల్లెగూడెం బ్రిడ్జిపై నాలుగు చోట్ల పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్
ఐదు రోజులుగా నిలిచిన నీటి సరఫరా.. పట్టించుకోని అధికారులు
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోయి ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఖమ్మం రూరల్‌ మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పల్లెగూడెం బ్రిడ్జిపై మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నాలుగు చోట్ల పగిలిపోవడంతో భారీగా నీరు వృథాగా పోతున్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టాల్సిన కార్మికులకు కాంట్రాక్టర్‌ గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదని, దీంతో వారు పనులకు దూరంగా ఉన్నారని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. ఫలితంగా పల్లెగూడెం బ్రిడ్జి మీదుగా ఖమ్మం రూరల్‌ మండలంలోని 12 గ్రామాలకు వెళ్లాల్సిన మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నీటిని అందించే ఏర్పాట్లు కూడా లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. ఒకవైపు పైప్‌లైన్‌ పగిలి నీరు వృథాగా పోతుండగా, మరోవైపు ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

తక్షణమే మరమ్మతులు చేపట్టాలి

ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం, కాంట్రాక్టర్‌ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం, అధికారులు సమస్యను సమన్వయం చేయడంలో విఫలమవడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) ఏదులాపురం మున్సిపాలిటీ కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఐదు రోజులుగా 12 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినా అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పల్లెగూడెం బ్రిడ్జిపై పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి, 12 గ్రామాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది