భద్రాచలం ఎమ్మెల్యే పీఏగా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి అరెస్ట్
54 మంది నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లు.. పలు ప్రాంతాల్లో కేసులు
ప్రజాపక్షం/భద్రాచలం: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన ఓ రెవెన్యూ ఉద్యోగి.. బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకుని, ఆ నష్టాలను పూడ్చుకునేందుకు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 54 మంది నుంచి సుమారు రూ.8 కోట్లు వసూలు చేసిన నిందితుడు చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. భద్రాచలం ప్రాంతానికి చెందిన కోర్ల కళ్యాణ్ రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో భద్రాచలం ఎమ్మెల్యేకు పీఏగా కూడా పనిచేసిన ఆయన.. మణుగూరు బీటీపీఎస్, సారపాకలోని ఐటీసీ తదితర సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించినట్లు వెల్లడించారు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, చర్ల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా సుమారు 54 మంది నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి భారీగా నష్టపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో కోల్పోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో మరింత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాధితుడు రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడు కోర్ల కళ్యాణ్‌ను అరెస్ట్ చేసి సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి: పోలీసులు
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే పూర్తిగా విచారించిన తర్వాతే స్పందించాలని పోలీసులు నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని హితవు పలికారు. అనుమానాస్పద లింకులు, బెట్టింగ్ యాప్‌లు లేదా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ ఉద్యోగి.. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి చివరకు జైలుపాలైన ఈ ఘటన.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి