ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అంతా ఏఐ మయం...


 రాజకీయ కౌంటర్లకు కూడా ఏఐ సాయం.. 

80s ఫోటోలతో కొత్త ట్రెండ్

మున్ముందుకు ఏ స్థాయికి వెళుతుందో..?

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటే మనిషి ఆలోచించాలి.. సమయం కేటాయించాలి.. కష్టపడాలి. ఇప్పుడు మాత్రం సాంకేతికత ఆ స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత వేగంగా మారుతున్నాయి. మనం ఆలోచించేలోపే సమాధానం.. మనం రాయడం ప్రారంభించేలోపే కథనం.. ఊహించకముందే ఫొటో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ ప్రభావం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.గతంలో సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను చూస్తే అవి ఒక్కో దశగా ముందుకు సాగాయి. కానీ ఏఐ విషయానికి వస్తే మాత్రం కనురెప్ప మూసి తెరిచేంత సమయంలోనే ఫలితం అందించే స్థాయికి సాంకేతికత చేరిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రభావం సామాజిక మాధ్యమాల నుంచి రాజకీయాల వరకు విస్తరించింది.

రాజకీయ కౌంటర్లకూ ఏఐ సాయం...

ఒకప్పుడు ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తే.. ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలు దానికి సమాధానం సిద్ధం చేసేందుకు కొంత సమయం తీసుకునేవారు. విమర్శలోని అంశాలను పరిశీలించి.. దానికి తగ్గట్టుగా కౌంటర్ సిద్ధం చేసి.. వాట్సప్, ఫేస్‌బుక్ తదితర వేదికల్లో పోస్టు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక రాజకీయ అంశాన్ని ఏఐ ముందు ఉంచి.. “దీనికి బలమైన కౌంటర్ కావాలి” అని అడిగితే చాలు. క్షణాల్లోనే ఒకటి కాదు.. రెండు మూడు రకాలుగా సమాధానాలు సిద్ధమవుతున్నాయి. మరింత ఘాటుగా కావాలంటే ఘాటుగా.. వ్యంగ్యంగా కావాలంటే వ్యంగ్యంగా.. విశ్లేషణాత్మకంగా కావాలంటే విశ్లేషణాత్మకంగా కౌంటర్‌ను తయారు చేసి ఇస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు గంటల వ్యవధిలో జరిగే రాజకీయ చర్చ.. ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే కౌంటర్, రీకౌంటర్‌గా మారుతోంది. అంటే రాజకీయ నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు.. వారి తరఫున ఆలోచించే మరో డిజిటల్ సహాయకుడు కూడా రంగంలోకి దిగినట్టే.

80s ఫోటోలతో మరో కొత్త ట్రెండ్...

ఇక తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న మరో ఆసక్తికరమైన ట్రెండ్ 80ల నాటి ఫొటోల రూపంలో ఏఐ సృష్టిస్తున్న చిత్రాలు. ప్రస్తుతం ఉన్న వ్యక్తులను అప్పటి కాలానికి తీసుకెళ్లినట్టుగా.. అప్పటి దుస్తులు, వాతావరణం, సినిమా తరహా నేపథ్యాలతో ఫొటోలను రూపొందిస్తూ నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.నేటి వ్యక్తిని 1980ల కాలం నాటి యువకుడిగా చూపించడం.. అప్పటి గ్రామీణ వాతావరణాన్ని పునఃసృష్టించడం.. పాతకాలపు సినిమా పోస్టర్ తరహాలో చిత్రాలు తయారు చేయడం వంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇక్కడ కూడా మనిషి ఊహకు ఏఐ సాంకేతికత తోడవుతోంది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అనే చిన్న ఆలోచనకు ఏఐ క్షణాల్లోనే ఒక రూపాన్ని ఇస్తోంది.

మంచికి ఉపయోగిస్తే అద్భుతమే...

ఏఐ వల్ల ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. సమాచారాన్ని త్వరగా విశ్లేషించడం, రాతపని సులభతరం చేయడం, భాషా సమస్యలను అధిగమించడం, ఫొటోలు-వీడియోల్లో సృజనాత్మకతను పెంచడం, విద్యార్థులకు వివరణలు అందించడం, వ్యాపార రంగంలో సమయాన్ని ఆదా చేయడం వంటి అనేక విషయాల్లో ఇది ఉపయోగపడుతోంది.ముఖ్యంగా చిన్న సంస్థలు, సాధారణ వ్యక్తులు కూడా గతంలో నిపుణుల సహాయం అవసరమైన కొన్ని పనులను ఇప్పుడు సులభంగా చేసుకునే అవకాశం ఏర్పడింది.

అయితే చెడు వైపు కూడా ప్రమాదమే...

అయితే ఏఐ ఎంత ఉపయోగకరమో.. అంతే జాగ్రత్తగా ఉపయోగించాల్సిన సాంకేతికత కూడా. నిజమైన ఫొటో ఏది? ఏఐతో రూపొందించిన ఫొటో ఏది? నిజమైన మాట ఏది? ఏఐ సృష్టించిన మాట ఏది? అనే తేడాను గుర్తించడం భవిష్యత్తులో మరింత కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.రాజకీయాల్లోనూ ఇదే ప్రమాదం ఉంది. వాస్తవాలను పరిశీలించకుండా ఏఐ ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగిస్తే తప్పుదోవ పట్టించే ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి చెప్పని మాటలను చెప్పినట్టుగా చూపించడం.. జరగని సంఘటనలను జరిగినట్టుగా చిత్రీకరించడం.. నిజమైన ఫొటోను మార్చి వేరే రూపంలో చూపించడం వంటివి సమాజంలో గందరగోళానికి దారితీయవచ్చు.అందుకే ఏఐ ఆలోచించడానికి సహాయం చేయొచ్చు కానీ మనిషి ఆలోచనకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ముందు ఏ స్థాయికి వెళుతుందో..?

ప్రస్తుతం మనం చూస్తున్న ఏఐసాంకేతికతేఆశ్చర్యపరుస్తుంటే.. రానున్న రోజుల్లో ఇది ఇంకెన్ని మార్పులకు దారితీస్తుందో ఊహించడం కూడా కష్టమే. రాజకీయ కౌంటర్ల నుంచి ఫొటోల వరకు వచ్చిన ఏఐ.. రేపు ఇంకెన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఏది ఏమైనా.. గత పరిస్థితులతో పోల్చుకుంటే సాంకేతిక రంగం అనూహ్యమైన పురోగతి సాధించింది అనేది వాస్తవం. ఆ పురోగతికి మరింత వేగాన్ని జోడించిన ఏఐ ఇప్పుడు మన జీవితాల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు మనిషి ఆలోచన తర్వాత సాంకేతికత పని చేసేది. ఇప్పుడు మనిషి ఆలోచనతో పాటు ఏఐ కూడా ఆలోచిస్తోంది. అందుకే ఇది కేవలం సాంకేతికత మార్పు కాదు.. మనిషి జీవన విధానంలో వస్తున్న మరో కొత్త మార్పు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది