తెలంగాణ సాయుధ పోరాటానికి సజీవ సాక్ష్యంగా ఎం. వెంకటాయపాలెం
ఉమ్మడి కమ్యూనిస్టు ప్రేరణతో ప్రజలను పీడిస్తున్న తండ్రి పైనే కొడుకు తిరుగుబాటు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఒకవైపు నైజాం నిరంకుశ పాలన.. మరోవైపు పీడిత ప్రజల ఆకలి కేకలు.. వెట్టిచాకిరీ, దోపిడీ, అణచివేతలతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారిన కాలం అది. హక్కుల కోసం నోరెత్తడమే నేరంగా భావించిన ఆ రోజుల్లో కొందరు మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు. అలాంటి పోరాట వీరుడి త్యాగానికి సాక్ష్యంగా నిలిచిన గ్రామమే ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం.1946 ప్రాంతంలో తెలంగాణలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతాంగ, ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. పీడిత ప్రజలకు భూమి, గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులు కావాలనే ఆకాంక్ష క్రమంగా పోరాట రూపం దాల్చింది. ఆ ఉద్యమానికి గౌరవంగా నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ వేడుకలో భాగంగా ప్రజాపక్షం ప్రత్యేక కథనం
తండ్రి పోలీస్ పటేల్.. కొడుకు ప్రజల పక్షం
అదే గ్రామానికి చెందిన గంగవరపు శ్రీనివాసరావు నైజాం వ్యతిరేక ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. అయితే ఆయనకు ఎదురుగా నిలిచింది కేవలం నైజాం పాలనా వ్యవస్థ మాత్రమే కాదు.. స్వయంగా తన కుటుంబ వ్యవస్థ కూడా.శ్రీనివాసరావు తండ్రి అప్పట్లో పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఒకవైపు తండ్రి ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పోలీస్ పటేల్ గా విధులు నిర్వహిస్తుండగా.. మరోవైపు కొడుకు అదే వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన నిలిచాడు.ఇది కేవలం రాజకీయ సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణ కాదు. ఒక తండ్రి బాధ్యతకు.. ఒక కొడుకు నమ్మిన ప్రజా హక్కులకు మధ్య జరిగిన సంఘర్షణగాధ వివరిస్తుంది.ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసి మౌనంగా ఉండలేక శ్రీనివాసరావు ఉద్యమంలోకి అడుగుపెట్టారు. తాడిత, పీడిత ప్రజలకు అండగా నిలిచారు. నైజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజలను చైతన్యపరిచారు.
తుపాకీ గుండుకు బలైన పోరాట యోధుడు
ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. ఉద్యమకారులపై అణచివేతలు పెరిగాయి. చివరకు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ బలగాల కాల్పుల్లో గంగవరపు శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తిగా ఆయన చనిపోయినప్పటికీ ఒక ఆలోచన మాత్రం చనిపోలేదు.ఆయన ప్రాణత్యాగం వెనుక ఉన్న ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలాయి.ప్రజలకు స్వేచ్ఛ ఉండకూడదా? పీడితులకు గౌరవంగా బతికే హక్కు లేదా?అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు సామాన్యుడికి లేదా? అనే ప్రశ్నలు, చైతన్యం వైపు ప్రజలు మరలారు. ఇలా శ్రీనివాసరావు పోరాటాన్ని ఈ ప్రశ్నల నేపథ్యంలో చూసినప్పుడు అది కేవలం ఒక రాజకీయ పోరాటంగా కాకుండా ప్రజల మానవ హక్కుల కోసం జరిగిన పోరాటంగా కనిపిస్తుంది.
భర్తను కోల్పోయిన వేళ.. గర్భంలో పోరాట వారసత్వం
శ్రీనివాసరావు మరణించే సమయానికి ఆయన భార్య గర్భవతి. భర్తను కోల్పోయిన విషాదం ఒకవైపు.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుపై తెలియని ఆందోళన మరోవైపు. ఇలాంటి తరుణంలో కొద్ది కాలానికి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రిని కళ్లారా చూడని విజయ్.. తండ్రి పోరాట గాథను మాత్రం వారసత్వంగా అందుకున్నారు. తుపాకీ పట్టిన తండ్రి స్థానంలో ప్రజా ఉద్యమాలనే తన మార్గంగా ఎంచుకున్నారు.తండ్రి ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తే.. కుమారుడు విజయ్ అదే ప్రజా ఉద్యమాల బాటలో నడిచారు. సీపీఐలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టారు. ప్రజల హక్కుల కోసం గొంతెత్తుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగించారు.
ప్రతి ఏటా గుర్తుకొచ్చే త్యాగం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు వచ్చిన ప్రతిసారీ ఎం. వెంకటాయపాలెంలో ఈ పోరాట గాథ మరోసారి గుర్తుకొస్తుంది. సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం( రేపు) శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విజయ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అన్యాయాన్ని ప్రశ్నించిన ఒక తరం త్యాగానికి.. ప్రజల హక్కుల కోసం సాగిన పోరాటానికి.. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన మరో తరానికి ఇచ్చే గౌరవంగా నిలిచింది.అలా ఎం. వెంకటాయపాలెంలో ఒక కుటుంబం కథ క్రమంగా ఒక తరం నుంచి మరో తరానికి సాగిన ప్రజా పోరాట గాథగా మారింది.ఒక తరం తుపాకీ గుండుకు ఎదురొడ్డి ప్రాణం అర్పిస్తే.. మరో తరం అదే పోరాట స్ఫూర్తిని ప్రజా ఉద్యమాల రూపంలో కొనసాగించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి