ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆవిష్కరణలకు వేదిక...శ్రీ చైతన్య



 జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026కు 43 జట్లు ఎంపిక

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: విద్యార్థుల ఆలోచనా శక్తిని సాంకేతిక ఆవిష్కరణలుగా మలుస్తూ, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అన్వేషించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 (SIH–2026) విద్యార్థుల్లో సృజనాత్మకతకు నూతనోత్సాహాన్ని అందిస్తోందని శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక అన్నారు. శనివారం పొన్నెకల్లు పంచాయతీ పరిధిలోని కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 అంతర్గత పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు.. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి వేదిక ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీసి, భవిష్యత్ ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే అవకాశం లభిస్తోందన్నారు. కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రంగాలకు సంబంధించిన వాస్తవ సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. కళాశాలలో నిర్వహించిన అంతర్గత పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. మొత్తం 78 జట్లు పోటీల్లో పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 43 జట్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ ఆలోచనలను కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక పరిష్కారాలుగా అభివృద్ధి చేయడం ద్వారా సాంకేతిక రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. కళాశాల డీన్ డాక్టర్ వి. సుదర్శన్ మాట్లాడుతూ.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ, ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విద్యార్థులకు అనుభవాత్మక అభ్యాసానికి చక్కటి వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి సమస్యలను గుర్తించడం, సమాచారాన్ని సేకరించడం, పరిశోధన చేయడం, పరిష్కారాలను రూపొందించడం, ప్రోటోటైప్ అభివృద్ధి, కోడింగ్, టెస్టింగ్ వంటి దశలను పూర్తి చేస్తూ తమ ఆలోచనలకు ఆచరణాత్మక రూపం ఇస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా టీమ్‌వర్క్‌తో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతున్నాయన్నారు. కళాశాల రీసెర్చ్ కోఆర్డినేటర్ డాక్టర్ మురళీ మోహన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సామాజిక సమస్యలకు సంబంధించిన పలు వినూత్న ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించారని తెలిపారు. AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను రూపొందించేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డిసెంబరులో నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 గ్రాండ్ ఫినాలేలో విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు మరింత ఉత్సాహంతో తమ ప్రాజెక్టులను మెరుగుపరుచుకుని విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ప్రాబ్లెమ్ ఐడెంటిఫికేషన్ – రీసెర్చ్ – ఇన్నోవేషన్ – ప్రోటోటైప్ – టెస్టింగ్ – సొల్యూషన్ అనే సమగ్ర ప్రక్రియ ద్వారా విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాంబాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, రీసెర్చ్ కోఆర్డినేటర్లు, మెంటర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది