ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సీపీఐ–సీపీఎం రాజీ.. 20 కేసులకు తెర


 పరస్పర ఒప్పందంతో కేసులు విత్‌డ్రా.. శుభ పరిణామంగా అభివర్ణించిన న్యాయమూర్తి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రస్తుత ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సీపీఐ–సీపీఎం మధ్య సాగిన రాజకీయ ఉద్యమాల నేపథ్యంలో నమోదైన కేసులకు ఎట్టకేలకు తెరపడింది. నాటి ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఇరు పార్టీల మధ్య చోటుచేసుకున్న వివిధ ఘర్షణలకు సంబంధించి నమోదైన సుమారు 20 కేసులను ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో శనివారం రాజీ చేసుకున్నారు. ఇందుకు లోకాదళత్ వేదిక కావడం లోకాదళత్ యొక్క గొప్ప ఆలోచనకు మంచి సాక్ష్యంగా నిలిచింది. దీంతో ఏళ్లుగా కొనసాగుతున్న కేసుల నుంచి ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు ఊరట లభించింది.ఇరు పార్టీల జిల్లా నాయకత్వాల నిర్ణయం మేరకు కేసుల్లో కీలకంగా ఉన్న సభ్యులు రాజీమార్గాన్ని ఎంచుకున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సారథ్యంలో ఇరు వర్గాల మధ్య రాజీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. పరస్పర విభేదాలను పక్కనపెట్టి కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరు పార్టీల నాయకులు సుహృద్భావ వాతావరణానికి బాటలు వేశారు. ఈ సందర్భంగా కేసుల రాజీ ప్రక్రియపై న్యాయమూర్తి సైతం హర్షం వ్యక్తం చేస్తూ, ఇరు వర్గాలు పరస్పర అవగాహనతో ముందుకు రావడం మంచి పరిణామమని అభివర్ణించినట్లు తెలిసింది. రాజకీయ విభేదాలు, ఉద్యమాల సందర్భంగా ఏర్పడిన వివాదాలు న్యాయపరమైన కేసులుగా మారి ఏళ్ల తరబడి కొనసాగడం కంటే, ఇరు పక్షాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సమాజానికి సైతం శుభ పరిణామంగా భావిస్తున్నారు. గతంలో ఒకే ఉద్యమ పంథాలో ప్రజా సమస్యలపై పోరాడిన ఇరు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు కేసుల నుంచి బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విభేదాలు ఉన్నా.. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవచ్చనే సందేశాన్ని ఈ రాజీ ప్రక్రియ చాటిచెప్పింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది