ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

త్రాగునీటికి గోదావరి, సాగర్ జలాలకు ప్రాధాన్యత



 వర్షాభావ పరిస్థితుల్లో నీటి ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ

జిల్లాలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

పల్లెగూడెం ఎన్ఎస్పీ కాలువ, వి.వెంకటాయపాలెం డీప్‌కట్ వద్ద నీటి పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గోదావరి, సాగర్ జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు నీటి అవసరం అధికంగా ఉండే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లాలని కోరారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పల్లెగూడెం ఎన్ఎస్పీ కాలువ లింక్ కెనాల్ పునరుద్ధరణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగర్ కాలువ నుంచి ఏదులాపురం చెరువుకు నీరు చేరే కాలువ, తూము మరమ్మతు పనులపై మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలువ ప్రస్తుత పరిస్థితి, సాగర్ కాలువ నుంచి ఏదులాపురం చెరువు వరకు ఉన్న దూరం, నీరు సాఫీగా ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. కాలువ, తూము పునరుద్ధరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ఆరా తీశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరినీ హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదుపరి రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం డీప్‌కట్ వద్ద నీటి పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రస్తుత నీటి లభ్యత, త్రాగునీటి సంరక్షణ, వివిధ కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గోదావరి, సాగర్ నుంచి తరలిస్తున్న నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలని, త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాధాన్యత క్రమంలో నీటిని వినియోగించాలని సూచించారు. వివిధ కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. నీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా కాలువలు, రెగ్యులేటర్లు, అవుట్‌లెట్లను నిరంతరం తనిఖీ చేయాలని, నీటి లభ్యతను బట్టి చెరువులను నింపేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ వాసంతి, ఖమ్మం ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాస్, వైరా ఈఈ బాబురావు, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, తహసీల్దార్లు వినయేందర్ రెడ్డి, అరుణ, ఇరిగేషన్ ఏఈ విక్రమ్‌తో పాటు పలువురు మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది