గుంతలమయంగా రహదారి.. రక్షణ ఏర్పాట్లు కరువు
ప్రజాపక్షం/బోనకల్: బోనకల్ మండల కేంద్రంలోని జగ్గయ్యపేట–వైరా ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్న ఈ బ్రిడ్జిపై రహదారి తరచూ దెబ్బతిని గుంతలు ఏర్పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా బ్రిడ్జిపై రహదారి తరచూ డ్యామేజీకి గురవుతుండగా, ఆర్అండ్బీ అధికారులు పలుమార్లు మరమ్మతులు చేపట్టినా కొద్దికాలానికే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్య పరిష్కారం కావడం లేదని, నాణ్యతా ప్రమాణాలతో శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ రింగులు, డివైడర్లు లేకపోవడం ప్రమాదాలకు మరో కారణంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనాలు రద్దీగా ప్రయాణించే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటోందని, అవసరమైన హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఇదే బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు మంద సత్యానందం దుర్మరణం పాలైన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన నేపథ్యంలోనైనా అధికారులు బ్రిడ్జి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరో ప్రాణం బలికాకముందే బ్రిడ్జిపై రహదారిని పూర్తిస్థాయిలో పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో పాటు ఇరువైపులా రక్షణ రింగులు, డివైడర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే ఆర్అండ్బీ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.


إرسال تعليق