కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధం.. ఇక కాంగ్రెస్–సురేఖ ఢీ?
గవర్నర్కు లేఖను సిఫారసు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించి, గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. అయితే తనను బర్తరఫ్ చేయడంపై సురేఖ తీవ్రంగా స్పందించారు. తన వివరణ తీసుకోకుండానే చర్యలు ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీ అంతర్గత పరిణామాలపై అధిష్ఠానానికి ఆమె వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. సురేఖ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నా.. అసలు రాజకీయ వేడి మాత్రం ఇక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత సురేఖ, ఆమె కుటుంబం నుంచి ఎలాంటి రాజకీయ స్పందనలు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నామినేటెడ్ పదవుల్లో మార్పులు చేపట్టింది. జి.చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు వైస్‌చైర్మన్‌గా నియమించడం, నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, గుండు సుధారాణిని కుడా చైర్‌పర్సన్‌గా నియమించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్ఠానం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఇక సురేఖ విమర్శలు.. కాంగ్రెస్ ప్రతి విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారే అవకాశం ఉంది.
మంత్రి పదవిలో ఉండగానే ప్రభుత్వంపై, పార్టీ వ్యవహారాలపై సురేఖ కుటుంబం నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో.. పదవి కోల్పోయిన తర్వాత వారి రాజకీయ అడుగులు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి