అనుమానంతో పట్టుకున్న స్థానికులు... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
ప్రజాపక్షం/నేలకొండపల్లి: బంగారు,వెండి వస్తువులను మెరుగుపెడతామని మాయమాటలు చెప్పి మహిళను నమ్మించి, పౌడర్ చల్లి విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించిన ఘటన నేలకొండపల్లిలో కలకలం రేపింది. స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... బీహార్‌కు చెందినట్లు భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు బుధవారం నేలకొండపల్లిలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ బంగారం, వెండి వస్తువులకు మెరుగుపెడతామని ప్రచారం చేశారు. ఈ క్రమంలో వారు త్రివేణి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమె వద్ద ఉన్న వస్తువులను మెరుగుపెడతామని నమ్మించారు. అయితే త్రివేణి నిరాకరిస్తున్నప్పటికీ ఆమె వద్ద ఉన్న వెండి పట్టీలపై ఓ పౌడర్ చల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పట్టీల లింకులు తెగిపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. సుమారు 15 తులాల పట్టీలు ఉండగా, నీటితో కడిగిన తర్వాత కేవలం 5 తులాల పట్టీలను మాత్రమే తిరిగి ఇచ్చినట్లు బాధితురాలు ఆరోపించింది. ఇవి తనవే కావని ప్రశ్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో వారి వెంట వచ్చిన మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఈ ముఠా గత నాలుగు రోజులుగా ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి మెడలో బంగారు ఆభరణాలు ఉండటంతో వాటిని చోరీ చేయడమే లక్ష్యంగా ముందుగానే రెక్కీ నిర్వహించి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. బీహార్‌కు చెందినట్లు భావిస్తున్న ఈ ముఠా మండలంలో సంచరిస్తోందనే అనుమానంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు స్థానిక పోలీసుల అదుపులో ఉండగా, పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి