కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోకుండానే ఎజెండా?
వరుస సమావేశాల్లోనూ ఇదే తంతు.. పాలకవర్గంలో అసంతృప్తి
మినిట్స్ బుక్‌లోని పలు తీర్మానాలపై కౌన్సిలర్ల అభ్యంతరాలు
వైరా మున్సిపాలిటీలో హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం
ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపల్ సమావేశం శనివారం జరగవలసినప్పటికీ కౌన్సిలర్ల వ్యతిరేకతతో వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుక్‌ను పాలకవర్గ కౌన్సిలర్లకు పంపిన నేపథ్యంలో, అందులోని కొన్ని ప్రతిపాదనలు, తీర్మానాలపై కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాలు తీసుకోకుండానే ఎజెండా? కౌన్సిల్ సమావేశానికి ముందు కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకుని ఎజెండా రూపొందించాల్సి ఉండగా, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎజెండా రూపొందించారని కొందరు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సమావేశంలో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నయి. వాయిదా పడే స్థాయికి చేరుకున్నప్పటికీ చివరకు సభ కొనసాగిన సందర్భాలు ఉన్నాయని కౌన్సిలర్లు గుర్తుచేస్తున్నారు.
పలు తీర్మానాలపై అభ్యంతరాలు
తాజా మినిట్స్ బుక్‌లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉన్న కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇంటి వద్దకు చెత్త సేకరణ వాహనం వస్తే రూ.100, మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలించే రథానికి రూ.1,000, ఫంక్షన్ హాల్‌కు ట్రాక్టర్ సేవలు అందిస్తే రూ.1,000 వసూలు చేసే ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వైరా పట్టణంలోని రహదారులను శుభ్రం చేసేందుకు సుమారు రూ.80 లక్షలతో మిషన్ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనపైనా కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ప్రజలకు అవసరమైన సేవల విషయంలో ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండా భారీ వ్యయంతో యంత్రం కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది.
వ్యాపార వాహనాలపై పన్ను ప్రతిపాదనపైనా అభ్యంతరం
వైరా పట్టణంలోని వ్యాపార సముదాయాలకు వివిధ రంగాలకు చెందిన సరుకులు తీసుకువచ్చే ట్రాన్స్పోర్ట్ వాహనాల నుంచి పన్ను వసూలు చేసే ప్రతిపాదనపైనా కొందరు కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ పన్నులు, రుసుములు చెల్లిస్తున్న వ్యాపారులపై మరో భారం పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే సూచనలు ఏమయ్యాయి?
గత కౌన్సిల్ సమావేశం అనంతరం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు అప్పటి మున్సిపల్ సమావేశం తర్వాత అధికార పార్టీ కౌన్సిలర్లతో చర్చించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లను సమావేశానికి ముందు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకుని తీర్మానాలు రూపొందించాలని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష కౌన్సిలర్లకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారం అందించాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ సూచనలు అమలయ్యాయా? లేదా? అనే ప్రశ్నలు కౌన్సిలర్లలోనే చర్చకు దారితీస్తున్నాయి.
కౌన్సిలర్ల పాత్రపై ప్రశ్నలు
కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులుగా కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను ప్రస్తావించి, ప్రజలకు సంబంధించిన తీర్మానాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తమ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే భావన కౌన్సిలర్లలో ఏర్పడితే అది పాలనాపరంగా కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.“కౌన్సిలర్లకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు? వారి అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ప్రజలకు సంబంధించిన తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉందా?” అనే ప్రశ్నలు ఇప్పుడు వైరా మున్సిపాలిటీలో వినిపిస్తున్నాయి.
అసలు ఏం జరుగుతోంది?
కౌన్సిలర్లు కేవలం తీర్మానాలను ఆమోదించే వారిగా కాకుండా, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. సమావేశాల్లో ఎజెండా రూపకల్పనపై అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయనే అంశంపై మున్సిపల్ యంత్రాంగం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వాయిదా పడిన సమావేశం : శనివారం జరగవలసిన మున్సిపల్ సాధారణ సమావేశం అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు వ్యతిరేకతో సమావేశంలో రారని తెలియడంతో మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి