ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆనందాన్ని నింపి.. గంగమ్మ ఒడికి గణపయ్య


 తొమ్మిది రోజులు పూజలు.. రీల్స్‌తో సందడి.. ఆఖరి రోజు మంత్రి పొంగులేటి ఆధ్యాత్మిక పర్యటన

ట్రెండింగ్‌గా నిలిచిన గణపయ్య ఆగమనం.. వర్షం అడ్డొచ్చినా ఆగని నిమజ్జనాలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తొమ్మిది రోజులు పూజలు అందుకున్నాడు.. భక్తుల ఆనందంలో భాగమయ్యాడు.. యువత రీల్స్‌లో ట్రెండ్ అయ్యాడు.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తుల నడుమ ఊరేగుతూ చివరకు గంగమ్మ ఒడికి చేరాడు. ఒకప్పుడు వినాయకుడి ఉత్సవం అంటే పూజలు, భజనలు, అన్నదానాలు, నిమజ్జనాలతో ముగిసిపోయేది. కానీ ఈసారి ఆధ్యాత్మికతకు ఆధునికత తోడైంది. గణపయ్య ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఘట్టం సోషల్ మీడియాలో సందడిగా మారింది. “చుట్టూ దిష్టి.. పిట్ట దిష్టి.. చుట్టూ ఇరుగుపొరుగు దిష్టి.. చిట్టి మహారాజా వీడే హారతి ఇవ్వండి” అంటూ సాగిన రీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికితోడు ఆఖరి రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాంప్రదాయ వస్త్రధారణలో పలు వినాయక మండపాలను సందర్శించి, అన్నదానాల్లో స్వయంగా పాల్గొని వడ్డించడంతో ఈ ఏడాది వినాయక ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.


ఆగమనంలోనే ట్రెండింగ్..


వినాయకుడి ఆగమనం అంటే గతంలో డప్పులు, బ్యాండ్‌లు, బాణసంచాతో సందడిగా నిర్వహించేవారు. విగ్రహాన్ని కొనుగోలు చేసి మండపంలో ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనంతో వేడుకలను ముగించేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈసారి వినాయక ఉత్సవాల్లోనూ కొత్తదనం కనిపించింది. విగ్రహాల ఆగమనం నుంచే రీల్స్ సందడి ప్రారంభమైంది. ముఖ్యంగా “చుట్టూ దిష్టి.. పిట్ట దిష్టి.. చుట్టూ ఇరుగుపొరుగు దిష్టి.. చిట్టి మహారాజా వీడే హారతి ఇవ్వండి” అంటూ రూపొందించిన రీల్స్ పలుచోట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మిక భావనకు వినోదాన్ని జోడిస్తూ యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా రీల్స్ చేశారు. దీంతో వినాయకుడి ఆగమనమే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.


ఆకట్టుకున్న ఆధ్యాత్మిక వేడుకలు.. రీల్స్ సందడి


వినాయక మండపాల ఏర్పాటు మొదటి నుంచే మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కాలనీ వాసులు, ఇరుగుపొరుగు ప్రజలు కలిసి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు గణపయ్యను కొలిచారు. మండపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈసారి ఆ సందడిలో రీల్స్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఏఐ సాంకేతికత కూడా యువత ఆలోచనలకు మరింత కొత్తదనాన్ని జోడించింది. తమకు నచ్చిన విధంగా సృజనాత్మక వీడియోలు రూపొందించుకుని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో భక్తి, వినోదం, సాంకేతికత కలగలిసి తొమ్మిది రోజుల పాటు వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది.


ఆఖరి రోజు మంత్రి పొంగులేటి పర్యటన ఆధ్యాత్మికంగా..


ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వినాయక ఉత్సవాల ఆఖరి రోజు ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. సాంప్రదాయ వస్త్రధారణలో వినాయకులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పలు మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లను తెలుసుకున్నారు. అనంతరం నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. తొమ్మిది రోజుల పాటు ఎంత శ్రద్ధగా గణపయ్యను కొలిచారో.. అదే శ్రద్ధతో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు.



వర్షం అడ్డొచ్చినా.. ఆగని నిమజ్జనాలు


గణపయ్య నిమజ్జనం అంటే భక్తులకు ఒకవైపు ఆనందం.. మరోవైపు వీడ్కోలు బాధ. తొమ్మిది రోజుల పాటు తమ మధ్య ఉన్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే సమయం కావడంతో భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పూజలు నిర్వహించి, ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. అయితే ఈసారి వర్షం నిమజ్జన వేడుకలకు కొంత ఆటంకంగా మారింది. అయినప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షంలోనే గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. డప్పుల మోతలు, భక్తుల నినాదాలు, యువత సందడి మధ్య గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక శోభను నింపి.. రీల్స్‌తో ట్రెండ్‌గా మారి.. భక్తుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన గణపయ్య.. చివరకు గంగమ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధునిక సాంకేతికత కలయికగా ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది