భక్తికి ప్రతీకగా మహిళల ప్రత్యేక కార్యక్రమం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడికి ఆఖరి రోజు శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనమైన ఆతిథ్యం అందించారు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలను స్వయంగా తయారు చేసి సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నైవేద్యాన్ని తయారు చేయగా.. మొత్తం 35 రకాల నైవేద్యాలను వినాయకుడికి సమర్పించారు. ఇంటివంటలతో తయారు చేసిన వివిధ రకాల ప్రసాదాలను అందంగా అమర్చి విఘ్నేశ్వరుడికి నివేదించారు. తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడికి ఆఖరి రోజు 35 రకాల నైవేద్యాలతో ఆతిథ్యం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఐక్యతగా నిర్వహించేందుకు చిట్టీలు వేసి మరి చేపట్టడం అద్భుతంగా నిలిచింది. అనంతరం స్వామివారికి సమర్పించిన ప్రసాదాలను భక్తులు, స్థానిక వాసులు భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళల భక్తి, ఐక్యతను పలువురు అభినందించారు. తొమ్మిది రోజుల ఉత్సవాలకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగింపు పలికారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి