చిన్న లీకేజీ అంటూ మిషన్ భగీరథ అధికారుల దాటవేత
కూసుమంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలోబురదమయం..
దుకాణదారులు, వాహనదారులకు అవస్థలు
ప్రజాపక్షం/కూసుమంచి: కూసుమంచి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ లీకేజీ సమస్య అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎనిమిది నెలలుగా పైప్‌లైన్ లీకవుతున్నా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ నుంచి లీకవుతున్న తాగునీరు రోడ్డుపైకి చేరడంతో అక్కడ పెద్దఎత్తున నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో సమీపంలోని దుకాణదారులతో పాటు అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
8 నెలలుగా ఇదే పరిస్థితి...
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాల్సిన మిషన్ భగీరథ వ్యవస్థలో పైప్‌లైన్ లీకేజీ ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, నెలలు గడుస్తున్నా సమస్యను అలాగే వదిలేయడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. లీకేజీ కారణంగా విలువైన తాగునీరు వృథా అవుతుండటంతో పాటు రోడ్డు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది.
‘చిన్న లీకేజీ’ అంటూ అధికారుల వివరణ
ఈ విషయంపై మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ వేణుగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. లీకేజీ ఉన్న మాట వాస్తవమేనని, అయితే అది చిన్న లీకేజీ కావడంతో పెద్దగా ఇబ్బంది లేదని తెలిపారు. త్వరలోనే మరమ్మతు పనులు చేపడతామని చెప్పారు. అయితే ‘చిన్న లీకేజీ’ పేరుతో ఎనిమిది నెలలుగా సమస్యను పరిష్కరించకపోవడమే అసలు సమస్య అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్న లీకేజీ అయినా రోజులు, నెలలు కొనసాగితే తాగునీటి వృథాతో పాటు రహదారి పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలి
మిషన్ భగీరథ అధికారులు ఇకనైనా స్పందించి లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని, రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి రహదారిని వినియోగానికి అనుకూలంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిన తర్వాత స్పందించడం కాకుండా, సమస్యను గుర్తించిన వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి