నకిలీ ఎరువులు విక్రయించినా.. అధిక ధరలకు అమ్మినా చర్యలు.
ప్రతి బస్తాకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాల్సిందే: వ్యవసాయాధికారి యం.రాధ
ప్రజాపక్షం/ నేలకొండపల్లి: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని నకిలీ ఎరువులు విక్రయించినా, నిర్ణయించిన ధరలకు మించి ఎరువులను అమ్మినా ఉపేక్షించేది లేదని మండల వ్యవసాయాధికారి యం. రాధ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, నిల్వలను పరిశీలించారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, అమ్మకపు వివరాలు, ధరల పట్టికను పరిశీలించిన ఆమె.. రికార్డుల్లో నమోదైన నిల్వలకు, గోడౌన్లలో ఉన్న స్టాక్‌కు మధ్య తేడాలు ఉన్నాయా లేదా తనిఖీ చేశారు. రైతులకు విక్రయిస్తున్న ఎరువుల వివరాలను పరిశీలించారు. దుకాణదారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని రాధ స్పష్టం చేశారు. ఎరువుల ధరలను ఎమ్మార్పీకి మించి వసూలు చేయరాదన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు తప్పనిసరిగా రశీదు అందజేయాలని సూచించారు. నకిలీ ఎరువులు విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎరువుల విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దుకాణదారులకు సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ విస్తరణాధికారులు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి