ఫైళ్లను పక్కనపెట్టి.. బ్రష్ పట్టిన కోటేశ్వరరావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సాధారణంగా జీపీఓ అంటే కార్యాలయంలో ఫైళ్లు, రికార్డులు, అధికారిక విధుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ ఖమ్మం రూరల్ మండలం జీపీఓ కోటేశ్వరరావు మాత్రం బుధవారం కాస్త భిన్నంగా కనిపించారు. చేతిలో పెన్ను, ఫైలు ఉండాల్సిన చోట.. ఏకంగా పెయింట్ బ్రష్ పట్టుకుని ఆర్టిస్టుగా అవతారమెత్తారు! ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 142 సర్వే నంబర్లో తహసీల్దార్ వినయేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ బోర్డుల ఏర్పాటు చేపట్టారు. బోర్డుపై ప్రభుత్వ సందేశాన్ని రాయాల్సి ఉండగా.. బయట నుంచి ఆర్టిస్టు కోసం ఎదురుచూడకుండా జీపీఓ కోటేశ్వరరావే స్వయంగా రంగంలోకి దిగారు. బ్రష్ చేతబట్టి బోర్డుపై ప్రభుత్వ సందేశాన్ని చక్కగా రాశారు.‘జీపీఓ నే కాదు.. ఆర్టిస్టు కూడా!’ అంటూ అక్కడున్న వారు సరదాగా చర్చించుకున్నారు. అయితే కోటేశ్వరరావు మాత్రం చమత్కారాలకు చోటివ్వకుండా తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు.అధికారిక విధులతో పాటు అవసరమైన సమయంలో అదనపు బాధ్యతను కూడా స్వీకరించి, పని పూర్తయ్యేలా చూసిన జీపీఓ కోటేశ్వరరావు తీరు పలువురిని ఆకట్టుకుంది. విధులు ఏవైనా.. పని పూర్తిచేయడమే తన బాధ్యత అన్నట్లుగా వ్యవహరించిన కోటేశ్వరరావు ‘జీపీఓ కమ్ ఆర్టిస్టు’గా బుధవారం ప్రత్యేకంగా నిలిచారు.

إرسال تعليق