ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నెలకు రూపాయి జీతంతో పనిచేస్తున్నా...


 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే నా తపన

నన్ను రాజీనామా చేయాలని కోరడం సిగ్గుచేటు: మంత్రి పొంగులేటి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలి... వారికి సొంతింటి కలను సాకారం చేయాలి... అదే నా తపన.. అదే నా లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేకంగా నిలిచాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి భావోద్వేగపూరితంగా మాట్లాడారు. తాను నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటూ పేద ప్రజల కోసం పనిచేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. పదవి, అధికారం తనకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి లభించిన అవకాశంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. పేద కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరి, వారు తమ ఇంట్లోకి అడుగుపెట్టే క్షణాన్ని చూడాలన్నదే తన తపన అని అన్నారు.పేదవాడి ఇంట్లో వెలిగే దీపమే నాకు నిజమైన సంతృప్తి.. వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే నాకు ఆనందం అన్న భావనతో మంత్రి చేసిన ప్రసంగం సాగింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.ఇదే సందర్భంలో తనను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. పేదల కోసం ఇంతటి నిబద్ధతతో పనిచేస్తున్న తనను రాజీనామా చేయాలని కోరడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేయడం సులభమేనని, కానీ పేదల బాధలను అర్థం చేసుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు.

ఒక్క రూపాయి జీతం.. భావోద్వేగానికి గురిచేసిన వ్యాఖ్య

అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి చేసిన నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ పనిచేస్తున్నా అనే వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు పదవులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వినిపించే ప్రస్తుత పరిస్థితుల్లో, తాను పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని మంత్రి చెప్పడం రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తించింది.లక్షల రూపాయల జీతాలు, వివిధ సౌకర్యాలు పొందుతున్న వారు ప్రజల సమస్యలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో  పేదల కళ్లల్లో ఆనందమే నా లక్ష్యం.. ఒక్క రూపాయి జీతంతో పనిచేస్తున్నా అని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను సైతం ఆలోచింపజేసేలా సాగాయి.అయితే రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. ఒక పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరినప్పుడు ఆ కుటుంబం కళ్లల్లో కనిపించే ఆనందమే తనకు అసలైన గుర్తింపు అని మంత్రి పొంగులేటి చెప్పిన తీరు సభలో భావోద్వేగ వాతావరణాన్ని కల్పించింది.పదవి కోసం కాదు.. పేదల కోసం పనిచేస్తున్నాననే సందేశాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి ఇచ్చారు. పేదవాడి సొంతింటి కల నెరవేరిన రోజే తనకు నిజమైన సంతృప్తి అని ఆయన చెప్పిన మాటలు ఈ ప్రసంగానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది