శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు కూలి సామగ్రి ధ్వంసం
ప్రజాపక్షం / నేలకొండపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నేలకొండపల్లి మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో రహదారులు, కార్యాలయాల ప్రాంగణాలు చిత్తడిగా మారగా.. మంగాపురంతండాలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఇంట్లోని సామగ్రి తడిసి ముద్దైంది. మంగాపురంతండాకు చెందిన భూక్యా శివాజీకి చెందిన ఇల్లు ఇప్పటికే శిథిలావస్థలో ఉండగా, గురువారం కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం తడిసిపోయింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నాచేపల్లి–మంగాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వర్షానికి చెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు రహదారిపై నెలకొన్న పరిస్థితిని పరిశీలించి, చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షించారు. వర్షాల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు చిత్తడిగా మారాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, స్థానిక పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండలంలోని చెరువుమాధారం చెరువు కూడా అలుగు పోసే స్థాయికి చేరువలో ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు మరింత కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి