మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత
మంత్రి పొంగులేటి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఒకే పాఠశాల నుంచి, ఐదుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకోవడం ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందనడానికి ఇది ఒక మైలురాయిగా మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు జలగం నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ప్రధానోపాధ్యాయులు శాంసన్, ఉపాధ్యాయులు ఆదిలక్ష్మి, ఎస్.కె. సాజిదా బేగం, టి. చినియా, ఎం.డి. షాబుద్దీన్‌లను కౌన్సిలర్ బోయిన కుమారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ.. ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం పాఠశాల సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్య, మౌలిక వసతుల పరంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.పాఠశాల అవసరాలు, సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయన సహకారంతో పాఠశాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు. అనంతరం మూడో శనివారం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుండు విజయలక్ష్మి, గ్రామదీపిక ఏరుపుల ప్రమీల, యువజన కాంగ్రెస్ నాయకుడు బోయిన సాయి యాదవ్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి