ఎరువుల ఆన్లైన్ యాప్ బుకింగ్ ఇబ్బందులు తొలగించాలి
కలెక్టర్‌కు రైతు సంఘం వినతి
ప్రజాపక్షం / ఖమ్మం : ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పెసర పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి డిమాండ్ చేసింది. అలాగే ఎరువుల ఆన్లైన్ యాప్ బుకింగ్ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల బృందం సోమవారం ఖమ్మం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ మాట్లాడుతూ.. ఎరువుల ఆన్లైన్ బుకింగ్ విధానం వల్ల గ్రామీణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి ఎరువుల కోసం దుకాణాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ సదుపాయాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాటు, ఆన్లైన్ విధానంపై ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన సహకారం అందడం లేదని పేర్కొన్నారు. దీంతో ఎరువుల కోసం రైతులు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వర్షాధార వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళికను రూపొందించి సమర్థంగా అమలు చేయాలని, పంటల సాగు, పెట్టుబడులు, మార్కెటింగ్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పాలేరు చెరువు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని చెరువులకు నీటిని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు భానోత్ రామకోటి, భాగం ప్రసాద్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు స్వర్ణ రమేష్, తోటపల్లి సీతారాములు, ఎర్ర శ్రీనివాసరావు, చింతల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి