కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.ఖమ్మం రూరల్ మండలంలో 51 మంది లబ్ధిదారులకు రూ.50,05,500 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అలాగే ఏదులాపురం మున్సిపాలిటీలో 70 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.23,66,500, ఖమ్మం రూరల్ మండలంలో 95 మందికి రూ.28,79,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పథకాల ద్వారా మొత్తం 216 మంది లబ్ధిదారులకు రూ.1,02,51,000 మేర ఆర్థిక సాయం అందింది. సీఎంఆర్ఎఫ్ కిందనే 165 మందికి రూ.52,45,500 విలువైన చెక్కులు పంపిణీ చేయగా.. వారంతా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలు, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతోఉపయోగపడుతుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, గత పాలకుల కంటే రెండు మూడు రెట్లు ప్రజలకు లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

إرسال تعليق