సిపిఐ కౌన్సిలర్ నిబద్ధత...ప్రజా సమస్యలకు చోటుగా ప్రారంభోత్సవ వేదిక
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరై, ప్రారంభోత్సవంలో భాగస్వాములై, ఫొటో దిగి వెళ్లిపోవడంతోనే తన పాత్ర ముగిసిందనుకోలేదు ఆ కౌన్సిలర్. వచ్చిన అవకాశాన్ని వార్డు ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినియోగించుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన TGNPDCL కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ కౌన్సిలర్, అడ్వకేట్ దండి శ్రీజాలోకేష్ ప్రారంభోత్సవంలో భాగస్వాములు కావడంతో పాటు వార్డు సమస్యల ప్రస్తావనకు ప్రాధాన్యమిచ్చారు. మంత్రి పొంగులేటితో పాటు కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా కలిసిన శ్రీజాలోకేష్, 30వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాప్రతినిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, అలాంటి సందర్భాలను ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామం గుర్తుచేసింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి