మధిరలో దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
మహాలక్ష్మి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు
మహిళల ఆటపాటలతో లడక బజారులో పండుగ సందడి
ప్రజాపక్షం/మధిర : పట్టణంలోని లడక బజారులో దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు మహిళల ఆటపాటలతో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు కొలువైన మండపాన్ని రూ.4,00,116 విలువైన కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వలిశెట్టి శ్రీనివాసరావు–ఆదిలక్ష్మి స్వాతి, బొర్రా సోమయ్య–లక్ష్మి దంపతులు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో లడక బజారు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. మహిళల కోలాహలం, పూల అలంకరణలతో లడక బజారు పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు కొనసాగాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

إرسال تعليق