కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
ఖమ్మం రూరల్ అఖిలపక్ష సమావేశం తీర్మానం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగింపునకు కారణమైన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న నిర్వహించనున్న నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని ఖమ్మం రూరల్ మండల అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్డులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు నండ్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టనున్న నిరసన ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న ఈ నిరసన ప్రదర్శనకు ఖమ్మం రూరల్ మండలంలోని గ్రామాల నుంచి పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిన అనిత, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, సీపీఐ(ఎం) మున్సిపాలిటీ కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి, సీపీఐ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, సిపిఎం మండల నాయకులు నందిగామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి