10 మంది విద్యార్థినులకు ఎలుకల కాటు.. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా.. భద్రతపై ఆందోళన
ప్రజాపక్షం /నేలకొండపల్లి: గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపింది. ఒకేసారి పదిమంది విద్యార్థినులకు ఎలుకల కాటు పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఘటనపై స్పందించిన పీడీఎస్‌యూ నాయకులు గురుకుల పాఠశాల వద్ద ధర్నా నిర్వహించి విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం రాత్రి పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నిద్రిస్తుండగా ఎలుకలు కరిచినట్లు విద్యార్థినులు తెలిపారు. ఈ ఘటనలో లిఖిత, లాస్య, శర్మిళ, రజిని, గీతిక, సానియా, సాయిపూర్విత, పుణ్యవతి, జ్యోషిక, వెన్నెలకు కాటు పడినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వెంటనే స్పందించి విద్యార్థినులను నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అర్జున్ గౌతమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఘటనపై సమాచారం అందుకున్న గురుకుల సంస్థ డిప్యూటీ సెక్రటరీ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్ అపూర్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమారిని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఎలుకలు సంచరిస్తున్నట్లు తెలుస్తోందని విద్యార్థుల తరఫున ఆందోళన వ్యక్తమైంది. గురుకుల ప్రాంగణంలో పరిశుభ్రత, ఆహార నిల్వలు, విద్యార్థుల వసతి గదుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఎలుకలు కరిచిన ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వలేదని పీడీఎస్‌యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన ఘటనలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పీడీఎస్‌యూ నాయకులు గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌తో మాట్లాడి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై గురుకుల ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలపై జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు. విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, యాక్టింగ్ కార్యదర్శి తిమ్మిడి రఘు, మురళీకృష్ణ, సుశాంత్, త్రినాథ్, భాను, ప్రవీణ్బాలు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి