అధికారిక కార్యక్రమంలో రాజకీయ వివాదంపై.. సిపిఐ కౌన్సిలర్ల ఆగ్రహం
ఈ వ్యవహారంపై కమిషనర్ అల్లా శ్రీనివాస్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం రాజకీయ వివాదంతో రసాభాసగా మారింది. అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలుత లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసి వెళ్లిపోయారు. అనంతరం 28, 30, 32వ వార్డుల్లో సంబంధిత సీపీఐ కౌన్సిలర్లు లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో వివాదం చోటుచేసుకుంది. సీపీఐ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో కౌన్సిలర్లు నిర్వహిస్తున్న పంపిణీ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు సృష్టించడంపై సీపీఐ కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కౌన్సిలర్లకు అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, రాజకీయ జోక్యంతో కార్యక్రమానికి ఆటంకాలు కలిగించడం ఏమిటని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయితే వారు ఏది చేసుకున్న తమకు సంబంధం లేదని కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు అది కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇదే పద్ధతి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ వివాదాలకు వేదికగా మార్చడం సరికాదని, ప్రజాప్రతినిధుల హోదాకు తగిన గౌరవం కల్పించాలని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారిక కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడటంతో పాటు కౌన్సిలర్లకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాల విషయంలో తాము ఎక్కడైనా వేలు పెడుతున్నామా? అని ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యులమైతే ఇదేం పద్ధతి అన్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొన్నారు.

إرسال تعليق