సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రపంచం కమ్యూనిస్టు వైపు చూస్తుందని, నేటి యువత ఆలోచనలు మార్పుకై మారుతున్నాయని, అందుకే ప్రపంచవ్యాప్తంగా . జెన్.జి ఉద్యమాలలోకి వస్తున్నారని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గ వీటి సరళ అన్నారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని తమ్మినేని సుబ్బయ్య భవనంలో సీనియర్ నాయకులు నందిగామ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీ మరియు ఖమ్మం రూరల్ మండల కమిటీల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా బుగ్గవీటి సరళ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతోంది. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా–ఉపాధి రంగాల్లో ఎదురవుతున్న సమస్యలు యువతను ఉద్యమాల వైపు నడిపిస్తున్నాయి. ప్రస్తుత పాలకుల విధానాలపై ప్రశ్నిస్తూ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల కోసం యువత గొంతెత్తుతోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాలపై, ముఖ్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలపై చర్చను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. జన్జి ఉద్యమాల్లో యువతుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారని భావించిన యువత నేడు సామాజిక సమస్యలపై చురుకుగా స్పందిస్తోంది. ముఖ్యంగా యువతులు పెద్ద సంఖ్యలో ఉద్యమాల్లో పాల్గొంటూ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. విద్య, ఉపాధి, మహిళల భద్రత, సమాన అవకాశాలు, వివక్షకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ, పాలకులను ప్రశ్నిస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడం, సామాన్య ప్రజల జీవన సమస్యలు యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రమకు గౌరవం, సంపదలో సమాన అవకాశాలు, విద్య–వైద్యం వంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలనే భావనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇలాంటి అంశాలపై కమ్యూనిస్టు ఉద్యమాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయని అన్నారు. అయితే, జెన్ జెడ్ ఉద్యమాలన్నీ కమ్యూనిస్టు భావజాలంతోనే సాగుతున్నాయని చెప్పలేమనీ , కానీ అసమానతలు, నిరుద్యోగం, దోపిడీ, వివక్ష వంటి సమస్యలపై యువత సంధిస్తున్న ప్రశ్నలు వామపక్ష రాజకీయాలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ చైతన్యాన్ని ప్రజా ఉద్యమాలుగా మలచడం, యువత ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల కోసం నిరంతరం పోరాడడం కమ్యూనిస్టు ఉద్యమాల ముందున్న ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. యువతలో మొదలైన ఈ రాజకీయ చైతన్యాన్ని సంఘటిత శక్తిగా మార్చగలిగితే సమాజంలో సమూల మార్పులకు పునాది పడుతుంది. యువతకు సరైన రాజకీయ అవగాహన కల్పించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం, సమానత్వం కోసం పోరాడే శక్తులను ఏకం చేయడం నేటి అవసరం. యువతులు కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఉద్యమాల్లో ముందుండడం సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ చైతన్యం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. యువత కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావడానికి సిద్ధంగా లేదు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతోంది. ఈ ఆకాంక్షలకు సామాజిక న్యాయం, సమానత్వం, దోపిడీ రహిత సమాజ నిర్మాణం వంటి లక్ష్యాలను జోడించి, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం సాగించినప్పుడే కమ్యూనిస్టు ఉద్యమాలు యువత విశ్వాసాన్ని మరింతగా పొందగలవు. అన్నారు.ఈ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ(ఎం) పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్,ఊరడి సుదర్శన్ రెడ్డి, రూరల్ మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, నాయకులు పి మోహన్ రావు, పెండ్యాల సుమతి, భూక్య నాగేశ్వరరావు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తోట పెద్ద వెంకటరెడ్డి, రాజశేఖర్, ఉపేందర్, తోట నరేష్ రెడ్డి, రవి, వీరబాబు, వెంకట్ రెడ్డి, రాంబాబు, సర్పంచులు విజయ్, హరిబాబు, ఆంటోనీ, వెంకటప్పయ్య, సత్యనారాయణ, వర కుమార్, యాదగిరి, పాపా చారి, అనీష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి