ప్రజాపక్షం/ఖమ్మం: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ సాయుధ బలగాలు పరేడ్ నిర్వహించి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించగా, అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
విధి నిర్వహణలో 155 మంది పోలీసుల ప్రాణత్యాగం
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన 155 మంది పోలీసు అమరవీరుల పేర్లను ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ శాలువాలతో సత్కరించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర కీలకం: కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, దేశ రక్షణలో సైన్యం, ప్రజల భద్రతలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ప్రదర్శించే నిబద్ధత, అంకితభావం, త్యాగాలు శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూనే ప్రజలకు రక్షణ, భద్రత, భరోసా కల్పించడంలో పోలీస్ శాఖ విశేషంగా కృషి చేస్తోందన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు సహకరిస్తూ, వారి బాధ్యతల నిర్వహణకు అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల సేవలు, త్యాగాలను కూడా గుర్తించుకోవాలని అన్నారు. ప్రస్తుతం నేరాల స్వరూపం మారుతోందని, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు వంటి నూతన తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు. పోలీస్, పరిపాలనా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అమరవీరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సీపీ
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిలో 10 మంది భారతీయ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి అసమాన త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణ, సమాజ శ్రేయస్సు, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా పోలీసులు తక్షణమే స్పందిస్తూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో తీవ్రవాద సమస్యల కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఉండేవని సీపీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు చేసిన కృషి ఫలితంగా నేడు ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. అమరవీరులు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం, కర్తవ్యనిష్ఠను ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజల భద్రత కోసం మరింత నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పలువురు పోలీసు అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాధ్, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


إرسال تعليق