ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రెగ్యులర్ డీటీఓ వచ్చినా.. మారని తీరు!


 

తొమ్మిది మందికి నెలవారీ మామూళ్లంటూ ప్రచారం.. సీనియర్ ఎంవీఐకి అదనపు వాటా!


పైకి పారదర్శకత.. తెరవెనుక పైసల వ్యవహారమంటూ ఆరోపణలు 


ఏజెంట్లకు నో ఎంట్రీ అంటూనే.. పనుల వెనుక అసలు కథేంటి?


ప్రజాపక్షం/ఖమ్మం( బైపాస్ రోడ్డు) : ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో ఆన్లైన్ మాటున ఆఫ్లైన్ వ్యవహారం సాగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఏజెంట్లకు ప్రవేశం లేదంటూ నిబంధనలు చెబుతున్నా.. ప్రజల పనులు సజావుగా సాగుతున్నాయా? అదనపు చెల్లింపుల ఆరోపణలకు తావిస్తున్న పరిస్థితులు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కార్యాలయం కంటే రహదారులపైనే నెలవారి మామూళ్ల రూపేనా వ్యక్తిగత రాబడి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అధికారి మారినా.. వ్యవహారం మారలేదా?


రెగ్యులర్ డీటీఓ బాధ్యతలు చేపట్టడంతో కార్యాలయంలో పనితీరు మెరుగుపడుతుందని, పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రజలు ఆశించారు. అయితే, తెరవెనుక వ్యవహారాలపై వినిపిస్తున్న ఆరోపణలు ఆ ఆశలపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై పర్యవేక్షణ ఎంతవరకు ఉంది? అన్న చర్చ మొదలైంది.


తొమ్మిది మందికి నెలవారీ వాటాలంటూ ప్రచారం!


కార్యాలయంలో ఎంవీఐల నుంచి అసిస్టెంట్ ఎంవీఐల వరకు తొమ్మిది మందికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ సీనియర్ ఎంవీఐకి మిగతావారితో పోలిస్తే అదనంగా రూ.500 అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు నెలవారి కట్టలేక వాహనాలు అమ్ముకుంటున్న దారుణ పరిస్థితి సైతం ఉన్నట్లు వారి వైపు నుంచి వినపడుతుంది. ఈ వ్యవహారాలతో కార్యాలయాల పనితీరుపై ఇలాంటి ప్రచారం రావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.


తీవ్ర చర్చనీయాంశంగా నూతన మార్పులు


కార్యాలయానికి వచ్చే సందర్శకుల వివరాలు, ఫోన్ నంబర్లు నమోదు చేసే విధానం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న కూడా చర్చకు వస్తోంది. భద్రత, సందర్శకుల నియంత్రణ కోసం ఈ విధానం అమలు చేస్తున్నారా? లేక కార్యాలయంలో అవినీతి జరుగుతుందనే ప్రచారం నుంచి జాగ్రత్త పడుతున్నారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత ఓ జిల్లా స్థాయి అధికారికి గతంలో ఇన్చార్జి జిల్లాస్థాయి అధికారిగా పనిచేసిన ఓ అధికారి డ్రైవర్ సహాయకుడిగా వ్యవహరిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇతర అధికారులకు సహాయకులుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల హోదా, బాధ్యతలు ఏమిటన్న విషయంపైనా స్పష్టత అవసరమని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయించినప్పుడు, నిర్ణీత రుసుములతోనే సేవలు అందుతున్నాయి అనే ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.


ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే స్పష్టత!


ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంపై వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నెలవారీ మామూళ్లంటూ జరుగుతున్న ప్రచారం? కార్యాలయంలో మధ్యవర్తుల పాత్ర ఏమైనా ఉందా? ప్రజలకు సేవలు నిబంధనల ప్రకారం అందుతున్నాయా? అన్న అంశాలపై విచారణ జరిపి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది