అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన
నీటి పొదుపు అంటే ఇదేనా?
ప్రజాపక్షం /వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీ చౌక్‌లో గత 20 రోజులుగా పలు ప్రాంతాల్లో తాగునీరు వృథాగా పోతూ రోడ్లపై ప్రవహిస్తోంది. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు పదేపదే అవగాహన కల్పిస్తుండగా, మరోవైపు మున్సిపాలిటీ పరిధిలోనే విలువైన తాగునీరు రోజుల తరబడి వృథాగా పోతుండటంపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 20 రోజులుగా నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు ఎందుకు చేపట్టడం లేదు? సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడానికి కారణమేంటి? నీటి వృథాను అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై సూచనలు చేసే అధికారులు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నీటి వృథాను అరికట్టడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి గాంధీ చౌక్‌లోని నీటి లీకేజీకి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, మున్సిపాలిటీ పరిధిలో ఇతర ప్రాంతాల్లోనూ నీటి లీకేజీలను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్యను చెప్పిన నిర్లక్ష్యం చేస్తున్నారు:కౌన్సిలర్ సునీత
12వ వార్డులో 20 రోజుల నుంచి త్రాగునీరు పైపులు లీక్ తో నీరు వృధాగా పోతుందని చెప్పినా కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని 12వ వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ అన్నారు. వార్డులో పలు ప్రాంతాల్లో త్రాగునీరు వృధాగా పోతుందని ఇప్పటికైనా అధికారులు సమస్యలను తెలుసుకుని స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టి నీటిని వృధా కాకుండా చూడాలని కోరారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి