రాబోయే ఎనిమిది నెలలు నీటి ఎద్దడి తప్పదన్న ఆందోళనల నేపథ్యంలోనూ నిర్లక్ష్యమా?
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎల్‌నినో ప్రభావం వేళ.. ఏదులాపురం మున్సిపాలిటీ మినీ ట్యాంక్‌బండ్‌గా పేరొందిన ఏదులాపురం చెరువు అలుగు నుంచి నీరు వృథాగా కిందకు ప్రవహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎనిమిది నెలలు నీటి పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో చెరువులోని నీరు వృథాగా బయటకు వెళ్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
35 గ్రామాలకు తాగునీటి ఆధారం
ఏదులాపురం చెరువులోని నీరు స్థానిక అవసరాలకే కాకుండా, రక్షిత మంచినీటి పథకం ద్వారా సుమారు 35 గ్రామాలకు తాగునీరు అందించే వ్యవస్థకు కీలకంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఏదులాపురం–వరంగల్ క్రాస్ రోడ్డు, ముత్తగూడెం, పెద్దతండా తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యతకు ఈ చెరువులోని నీరు దోహదపడుతోందని చెబుతున్నారు. చెరువులో నీరు నిల్వ ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
గతంలో దెబ్బతిన్న అలుగు మార్గం?
చెరువు అలుగు నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం గతంలో దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే నీరు వృథాగా ప్రవహిస్తున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నీరు బయటకు వెళ్లడానికి గల అసలు కారణాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది. నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించుకోవడం అత్యంత ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సీఎం పిలుపు ఒకవైపు.. వృథా మరోవైపు!
నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో చెరువు నుంచి నీరు వృథాగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం, నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అంటున్నారు. చెరువులో నిల్వ ఉన్న నీరు వృథాగా బయటకు వెళ్లకుండా చూడటంతోపాటు, భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించాలి: దండి రంగారావు
ఈ అంశంపై సీపీఐ నాయకుడు, 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు స్పందిస్తూ.. సంబంధిత ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చెరువు అలుగు మార్గాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. గతంలో దెబ్బతిన్న ప్రాంతం ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టి నీరు వృథాగా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులో నీరు సమృద్ధిగా ఉండటం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యతకు దోహదపడుతోందని పేర్కొన్నారు. ఇదే విధంగా నీరు బయటకు వెళ్లిపోతే భవిష్యత్తులో నీటి అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి