తక్కువ వర్షపాతంతో రైతులకు నష్టం జరగకుండా చూడాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎల్‌నినో ప్రభావంతో పంట సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం బైపాస్ రోడ్డులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో షేక్ షాహిన్ అధ్యక్షతన ఖమ్మం రూరల్ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడారు... తక్కువ వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల పంటల సాగుకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితుల్లో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసిన రైతులకు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టం వాటిల్లితే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని, సాగుకు అనుకూల పరిస్థితులు లేక పంటలు వేయలేని రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు అండగా నిలిచేలా రైతు భరోసా పథకం ద్వారా సాయం అందించాలని పేర్కొన్నారు. మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలను ముందుగానే గుర్తించి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, నీటి సరఫరాపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, పగిళ్ల వీరభద్రం, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, బూర నాగేశ్వరరావు, వెంపటి సురేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బూర మనోజ్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి