అభిమానానికి రక్తంతో చిత్ర అభిషేకం.. కృతజ్ఞతను చాటుకునేందుకు వినూత్న కానుక
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అభిమానం అంటే మాటల్లో చెప్పేది కాదు.. మనసులో నుంచి పుట్టేది! ఆపదలో అండగా నిలిచిన వారిపై ప్రేమను, కృతజ్ఞతను చాటుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ కొందరి అభిమానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రత్యేకంగా నిలుస్తుంది. తనను ప్రోత్సహించి, తన ఎదుగుదలకు తోడుగా నిలిచిన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని రక్తంతో చిత్రాలు గీయించి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బహుకరించడం ద్వారా మరోసారి కృతజ్ఞత చాటుకుంటూ వార్తల్లో నిలిచాడు కాంగ్రెస్ యువజన నాయకుడు ఏనుగు మహేష్ .
ఎదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ ఏనుగుల స్వరూప తనయుడైన మహేష్ కు తనను రాజకీయంగా ప్రోత్సహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఎంతో అభిమానం. ఈ నేపథ్యంలోనే ఈనెల 28( రేపు) తన అభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకొని తన రక్తం హైదరాబాదు పంపించి అక్కడి నుంచి ఈసారి ముందస్తుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రాలను సిద్ధం చేయించారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్లో గల తన క్యాంపు కార్యాలయంలో తల్లి స్వరూపతో కలిసిన మహేష్, ఆ చిత్రపటాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలుస్తున్న శీనన్నపై తనకున్న అభిమానాన్ని, కృతజ్ఞతను మరోసారి చాటుకున్నారు.చిన్న వయసులోనే తన ప్రత్యేక అభిమానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏనుగుల మహేష్, మంత్రి జన్మదినం సందర్భంగా అందించిన ఈ వినూత్న కానుక ప్రశంసనీయంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి