ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా రామ్ రెడ్డి చరణ్ రెడ్డి
పాలేరు కాంగ్రెస్ శ్రేణులను మంత్రి స్ఫూర్తితో సమన్వయం చేస్తూ.. అన్న విజయానికి చరణ్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు!
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఎన్నికల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య వక్తగా హాజరైన ఈ సమావేశంలో చరణ్ రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ వారసుడిగా పాలేరు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన చరణ్ రెడ్డి.. సర్వోత్తమ్ రెడ్డి విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.
అన్న విజయం కోసం అగ్రభాగాన చరణ్ రెడ్డి..
కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే యువ నాయకుడిగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో చరణ్ రెడ్డి చూపిన చొరవ సమావేశంలో చర్చనీయాంశమైంది. సర్వోత్తమ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో చరణ్ రెడ్డి కీలక భాగస్వామిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతను, పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా కదిలించడంలో ఆయన పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజకీయ వారసత్వం.. విజయానికి బలమైన అనుబంధం!
కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన దివంగత నేతల కుటుంబాలతో ముడిపడిన రాజకీయ అనుబంధాలు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సర్వోత్తమ్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణుల ఐక్యత, పట్టభద్రుల మద్దతు కీలకం కానుండగా.. చరణ్ రెడ్డి వంటి యువ నాయకుల సమన్వయం ఎన్నికల ప్రచారానికి మరింత ఊతమివ్వనుంది. ఈ నేపథ్యంలో సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం చరణ్ రెడ్డి పోషించనున్న పాత్రపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి