గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపు
ప్రజాపక్షం/బోనకల్: రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. శనివారం బోనకల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతుబంధు, నాణ్యమైన విద్యుత్, ఎరువులు, సాగునీటి సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, యాప్‌లో నమోదు చేసుకోవాలనే నిబంధనలు వారి కష్టాలను మరింత పెంచుతున్నాయని విమర్శించారు. చదువుకున్న వారే యాప్‌ల వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతులు వాటి ద్వారా ఎరువులు పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యం సహా వివిధ రంగాల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. పార్టీ నాయకులు గ్రామస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా కాకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే తీర్పుగా భావించాలని నామ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు సాధించే లక్ష్యంతో గ్రామస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. మిగిలిన ఆరు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రాడ్యుయేట్ ఓటర్లను నేరుగా కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలని సూచించారు. బంధువులు, మిత్రులు, పరిచయస్తులకు ఫోన్ చేసి ఓట్లు అభ్యర్థించాలని, ఓటర్ల నమోదు, ప్రచార వివరాలను పార్టీ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ తర్వాత కూడా ఖమ్మం జిల్లాలోనే ఉంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారని నామ పేర్కొన్నారు. ఈసారి ఆయనకు విజయం అందించి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. మధిర నియోజకవర్గాన్ని గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రచారంలో జిల్లాలోనే ముందంజలో నిలపాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి